Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 26-4
సంపుటము: 1-159
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
మోసమున మాయావిమోహితుఁడై పోయి
కాసు సేయని పనికి గాసిఁ బడెఁ బ్రాణి
॥మోసమున॥
కన్నులనియెడి మహాకల్పభూజము లివి
తన్నుఁ బుణ్యునిఁ జేయఁ దగిలి వచ్చినవి
వున్నతోన్నతబుద్ధి నొనగూర్ప కది దేహి
కన్న చోటికిఁ బఱపి గాసిఁ బడెఁ బ్రాణి
॥మోసమున॥
చిత్తమనియెడి మహాచింతామణి దనకు
తొత్తువలె వలసి తనుఁ దోడు తేఁగలది
హత్తించి హరిమీఁద నలరింప కది వృథా
తిత్తిలో సుఖమునకు తిరిగె నీప్రాణి
॥మోసమున॥
కామతత్వంబనెడి కామధేనువు దనకు
వేమారుఁ గోరికల వెల్లిగొలిపెడిది
యీమేను తిరువేంకటేశుఁ జేరకపోయి
కామాంధుఁడై మిగుల గతిమాలెఁ బ్రాణి
॥మోసమున॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము