Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 36-6
సంపుటము: 1-225
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
ఏది కడ దీని కేది మొదలు । వట్టి-
వేదనలు తన్ను విడుచు టెన్నఁడు
॥ఏది॥
తొడరిన హృదయమే తోడిదొంగయై
వడిగొని తన్ను వలఁ బెట్టఁగాను
కడఁగి కర్మములఁ గడచు టెన్నడు
నిడివిబంధముల నీఁగు టెన్నఁడు
॥ఏది॥
తతిగొన్న తలఁపులే దైవయోగమై
మతినుండి తన్ను మరిగించఁగాను
ప్రతిలేని యాపదఁ బాయు టెన్నఁడు
ధృతిమాలిన యాస దీరు టెన్నఁడు
॥ఏది॥
పొదలిన మమతయే భూతమై తన్నుఁ
బొదిగొని బుద్ధి బోధించఁగాను
కదిసి వేంకటపతిఁ గనుట యెన్నఁడు
తుదలేని భవములఁ దొలఁగు టెన్నఁడు
॥ఏది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము