అధ్యాత్మ సంకీర్తన
రేకు: 4-3
సంపుటము: 1-23
రేకు: 4-3
సంపుటము: 1-23
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| అదివో [1]అల్లదివో హరివాసము [2]పదివేలు శేషుల పడగల మయము | ॥అదివో॥ |
| అదె వేంకటాచల [3]మఖిలవున్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు నదె చూడుఁ డదె మొక్కుఁ డానందమయము | ॥అదివో॥ |
| చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము | ॥అదివో॥ |
| కైవల్యపదము వేంకటనగ మదివో శ్రీవేంకటపతికి సిరులైనది భావింప సకలసంపదరూప మదివో పావనములకెల్లఁ బావనమయము | ॥అదివో॥ |
[1] ‘అల్లదిహో’ పూ.ము.పా.
[2] ‘పదివేల’ కావచ్చు.
[3] ‘అఖిలోన్నతము’ పూ.ము.పా.


