Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 41-2
సంపుటము: 1-250
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఏమి సేయువార మిఁకను
ఆమనిచేల పచ్చలాయ బ్రదుకు
॥ఏమి॥
దీపన మనియెడి తీరని యాస
రేపుమాపుఁ బెడరేఁచఁగా
తోపు సేయఁగరాక దురితపుతరవుల-
కాపదలకు లోనాయ బ్రదుకు
॥ఏమి॥
వేడుకనెడి పెద్దవిడువని తరవు
వోడ కెపుడు వొద్దనుండఁగా
జోడు విడువరాక చులుకఁదనంబున-
కాడికెలకు లోనాయ బ్రదుకు
॥ఏమి॥
మమకారమనియెడి మాయతరవు
తిమిర మెక్కించుక తియ్యఁగా
విమలమూరితియైన వేంకటగిరిపతి
అమరఁ జేరక [1]యరవాయ బ్రదుకు
॥ఏమి॥

[1] ‘యెరవు’నకు వ్యావహారికరూపము కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము