Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 67-1
సంపుటము: 1-346
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నానాదిక్కుల నరులెల్లా
వానలలోననె వత్తురు గదలి
॥నానా॥
సతులు సుతులుఁ బరిసరులు బాంధవులు
హితులు గొలువఁగా నిందరును
శతసహస్రయోజనవాసులు సు-
వ్రతములతోడనె వత్తురు గదలి
॥నానా॥
ముడుపులు జాళెలు మొగిఁ దలమూఁటలు
కడలేని ధనముఁ గాంతలును
కడు మంచిమణులు కరులుఁ దురగములు
వడిగొని చెలఁగుచు వత్తురు గదలి
॥నానా॥
మగుటవర్ధనులు మండలేశ్వరులు
జగదేకపతులుఁ జతురులును
తగు వేంకటపతి దరుశింపఁగ బహు-
వగల సంపదల వత్తురు గదలి
॥నానా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము