అధ్యాత్మ సంకీర్తన
రేకు: 68-3
సంపుటము: 1-354
రేకు: 68-3
సంపుటము: 1-354
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎక్కడనున్నా నీతఁడు దిక్కయి మాదెసఁ దిరిగీఁ గాక | ॥ఎక్కడ॥ |
| సరసుఁడు చతురుఁడు జగదేకగురుఁడు పరమాత్మ డఖిల బంధువుఁడు హరి లోకోత్తరుఁ డతఁడే నామతి సిరితోఁ బాయక చెలఁగీఁ గాక | ॥ఎక్కడ॥ |
| ఉన్నతోన్నతుఁ డుజ్జ్వలుఁ డధికుఁడు పన్నగశయనుఁడు భవహరుఁడు యిన్నిటఁ గలిగిన యిందిరారమణుఁడు మన్ననతో మము మనిపీఁ గాక | ॥ఎక్కడ॥ |
| మమతల నలమేల్మంగకు సంతత - రమణుఁడు వేంకటరాయఁడు జమళిసంపదల సరసవిభవముల తమకంబున మముఁ దనిపీఁ గాక | ॥ఎక్కడ॥ |


