Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 80-2
సంపుటము: 1-383
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
అభయ మభయమో హరి నీకు(వు?)
విభుఁడ వింతటికి వెర విఁక నేది
॥అభయ॥
జడిగొని మదిలో శాంతము నిలువదు
కడుఁ గడు దుస్సంగతి వలన
యిడుమ లేని సుఖ మించుక గానము
అడియాసల నా యలమటవలన
॥అభయ॥
తలఁపులోన నీ తత్వము నిలువదు
పలు లంపటముల భ్రమవలన
కలిగిన విజ్ఞాన గతియును దాఁగెను
వెలి విషయపు పిరివీకుల వలన
॥అభయ॥
పక్కనఁ బాపపు బంధము లూడెను
చిక్కక నినుఁ దలఁచిన వలన
చిక్కులు వాసెను శ్రీవేంకటపతి
నిక్కము నా కిదె నీకృప వలన
॥అభయ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము