Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 93-4
సంపుటము: 1-462
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
మహి నింతటివారువో మనవారు
బహుమహిమలవారు ప్రపన్నులు
॥మహి॥
జయమంది జననపు జరామరణముల
భయములేనివారు ప్రపన్నులు
క్రియలెల్ల నుడిగి మూఁగిన కర్మపుటడవి
బయలుచేసినవారు ప్రపన్నులు
॥మహి॥
ధీరులై మాయాంధకారంబు నెదిరించి
పారఁదోలినవారు ప్రపన్నులు
సారమయ్యిన సంసారసాగరము
పారము గన్నవారు ప్రపన్నులు
॥మహి॥
అండ నిన్నిటాఁ దనిసి యాసలెల్లాఁ దెగఁగోసి
పండిన మనసువారు ప్రపన్నులు
దండిగా శ్రీవేంకటేశుదాసులై పరముతోవ
బండిబాట చేసినారు ప్రపన్నులు
॥మహి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము