Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-1
సంపుటము: 1-483
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
[1]అమ్మెడి దొకటి [2]అసిమలో దొకటి
బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా
॥అమ్మెడి॥
సంగము మానక శాంతియుఁ గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేటి పెద్దలమయ్యా
॥అమ్మెడి॥
కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువ మనసు
క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు
పేరడి నేమిటి పెద్దలమయ్యా
॥అమ్మెడి॥
ఫలము లందితే బంధము వీడదు
ఫలముతో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశు దాసులము
పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా
॥అమ్మెడి॥

[1] ‘అమ్మేదొకటి’ పూ.ము.పా.

[2] ‘అసిమసంచి’ ‘అశ్వసంచి’కి వికృతియా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము