అధ్యాత్మ సంకీర్తన
రేకు: 98-5
సంపుటము: 1-493
రేకు: 98-5
సంపుటము: 1-493
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| నేరిచి బ్రదికేవారు నీ దాసులు నేరమిఁ బాసినవారు నీ దాసులు | ॥నేరిచి॥ |
| కామముఁ గ్రోధము రెంటీఁ గాదని విడిచి మంచి- నేమము వట్టినవారే నీదాసులు దోమటి బాపపుణ్యాలఁ దుంచివేసి చూడగాఁనే నీ మాయ గెలిచినారు నీ దాసులు | ॥నేరిచి॥ |
| కిక్కిరించిన యాసలఁ గిందవేసి మోక్షము నిక్కి నిక్కి చూచేవారు నీ దాసులు వెక్కసపు భక్తితోడ వెఱపు మఱపు లేక నెక్కొన్న మహిమవారు నీ దాసులు | ॥నేరిచి॥ |
| అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచి నెట్టుకొని మించినారు నీ దాసులు యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లా నెట్టువడఁ దోసినారు నీ దాసులు | ॥నేరిచి॥ |


