Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 99-6
సంపుటము: 1-500
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు
తక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని
॥ఒక్కఁడే॥
యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావు
గుఱియై మాయలలోనఁ గూడించే వింతె
మఱవకు జీవుఁడా మనసు చుట్టము గాదు
తెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె
॥ఒక్కఁడే॥
తెలుసుకో జీవుఁడా దేహమును నమ్మరాదు
వలసితే నుండుఁ బోవు వన్నెవంటిది
తలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు
పలులంపటములచేఁ బరచెడి దింతె
॥ఒక్కఁడే॥
సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు
బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డితనిమూలమే యింత
నెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే
॥ఒక్కఁడే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము