Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 102-1
సంపుటము: 2-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఒల్లఁడు గాక దేహి వుద్యోగించఁడు గాక
కొల్లలైన మేలు తనగుణములో నున్నది
॥పల్లవి॥
తలఁచుకొంటేఁ జాలు దైవమేమి దవ్వా
నిలుచుక తనలోనే నిండుకున్నాఁడు
చలపట్టితేఁ జాలు సర్గమేమి బాఁతా
చలివేఁడి నాలికపై సత్యములో నున్నాఁడు
॥ఒల్లఁ॥
ఆయమెఱిఁగితేఁ జాలు నాయుష్యము గరవా
కాయపుటూపిరిలోనే గని వున్నది
చేయఁబోతే పుణ్యుడుగా జీవునికిఁ దడవా
చేయారఁ గర్మము తనచేతిలోనే వున్నది
॥ఒల్లఁ॥
మొక్క నేరిచితేఁ జాలు మోక్షమేమి లేదో
యెక్కువ శ్రీవేంకటేశుఁ డిదె వున్నాఁడు
దక్కఁగొంటేఁ జాలు పెద్దతనమేమి యరుదా
తక్కక శాంతముతోడి దయలోన నున్నది
॥ఒల్లఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము