Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 102-5
సంపుటము: 2-11
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుఁడా
నీ మఱఁగు చొచ్చితిని నెరవేర్తు గాక
॥పల్లవి॥
కడివోని జవ్వనము కలిమిలేమెఱుఁగునా
బడినుండి మిగుల రుణపరచుఁ గాక
అడియాసలెల్లాఁ బుణ్యముఁ బాప మెఱుఁగునా
వెడగుఁ దనలో దయ విడిపించుఁ గాక
॥ఏమి॥
వలపు వెఱ పెఱుఁగునా వాఁడిమొనలకునైన
బలిమిఁ దూరించఁ జలపట్టుఁ గాక
చలనమందిన మనసు జాతి నీతెఱుఁగునా
కలిసి హేయమున కొడిగట్టించుఁ గాక
॥ఏమి॥
యెలమి రతిపరవశము యెగ్గుసిగ్గెఱుఁగునా
బలిమిఁ దిట్లకు నొడఁబఱచుఁ గాక
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి
తలఁగించి యేలితివి దయసేతు గాక
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము