Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 103-1
సంపుటము: 2-13
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
చీ చీ వివేకమా చిత్తపు వికారమా
యేచి హరిఁ గొలువక హీనుఁడాయ జీవుఁడు
॥పల్లవి॥
బతికేనంటాఁ బోయి పయిఁడి వుచ్చుక తన-
పతి యవసరములఁ బ్రాణమిచ్చీని
బతు కందులోన నేది పసిఁడి యెక్కడ నుండు
గతి హరిఁ గొలువక కట్టువడె జీవుఁడు
॥చీచీ॥
దొడ్డవాఁడనయ్యేనని దొరలఁ గొలిచి వారి-
కడ్డము నిడుపు మొక్కు నతిదీనుఁడై
దొడ్డతన మేది యందు దొర యాడనున్నవాఁడు
వొడ్డి హరిఁ గొలువక వోడుపడె జీవుఁడు
॥చీచీ॥
చావనేల నోవనేల సారెఁ గిందుపడనేల
యీవల శ్రీవేంకటేశుఁడింట నున్నాఁడు
దేవుఁ డాతఁడే నేఁడు తెలిసి కొలిచేఁ గాని
భావించ కిన్నాళ్ళదాఁకా భ్రమఁబడె జీవుఁడు
॥చీచీ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము