అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-4
సంపుటము: 1-70
రేకు: 11-4
సంపుటము: 1-70
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ దెలియుట దనలోఁ దెలియుట కొరకే | ॥తలఁచిన॥ |
| ఉదయమందుట భవముడుగుట కొరకే చదువుట మేలు విచారించు కొరకే బ్రదుకుట పురుషార్థపరుఁడౌట కొరకే యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే | ॥తలఁచిన॥ |
| తగులుట విడివడఁదలఁచుట కొరకే నొగులుట కర్మమనుభవించు కొరకే చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే బెగడుట దురితము పెడఁబాయు కొరకే | ॥తలఁచిన॥ |
| యీవలఁ జేయుట ఆవలి కొరకే ఆవల నుండుట యీవలఁ కొరకే యీవల నావల నెనయఁ దిరుగుటెల్ల శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే | ॥తలఁచిన॥ |


