Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 150-5
సంపుటము: 2-233
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళవసంతం
మూఁడే మాటలు మూఁడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదువరో వేదాంతరహస్యము
॥పల్లవి॥
జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతిసంపద యిది యెఱుఁగుటే
వేవేలువిధముల వేదాంతరహస్యము
॥మూఁడే॥
తనలోని జ్ఞానము తప్పకుండాఁ దలపోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మఱవకుండుటే
వినవలసినయట్టి వేదాంతరహస్యము
॥మూఁడే॥
వేడుకతో నాచార్యవిశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశ్వరుఁగొలిచి దాసుఁడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంతరహస్యము
॥మూఁడే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము