అధ్యాత్మ సంకీర్తన
రేకు: 151-2
సంపుటము: 2-236
రేకు: 151-2
సంపుటము: 2-236
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును వొకటి కోటిగుణితంబగు మార్గములుండఁగఁ బ్రయాసపడనేలా | ॥పల్లవి॥ |
| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనకబిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసిన ఫలములు తనుఁ దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగఁగ మఱి యేలా | ॥త్రిక॥ |
| హరియను రెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమునఁ జదివిన పుణ్యములు పరమ తపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకఁగనేలా | ॥త్రిక॥ |
| మొదల శ్రీవేంకటపతికినిఁ జేయెత్తి మొక్కిన మాత్రములోపలనే పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాగంబులుగాఁ జేసినవాఁడే కాఁడా పలుమారు మదిమదినుండే కాయక్లేశము మాఁటికి మాఁటికి దనకేలా | ॥త్రిక॥ |


