Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 151-4
సంపుటము: 2-238
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
మనసులో మర్మమై మరలఁ బారుచునుండు
పొనుఁగువడ్డ మదము పోవఁగనీదు
॥పల్లవి॥
తింటేనే విషమెక్కు దిష్టముగ విషలత
కంటేనే వలపెక్కుఁ గాంతలను
అంటిముట్టి కాఁగిట నలముకొంటేఁ గనక
మంటఁ గలసిన భ్రమ మానలేదు
॥మన॥
మెట్టితేనే కఱచును మెలుపుతోడుతఁ బాము
పట్టితే విడువనీదు పచ్చనిపైఁడి
దట్టమై మేన సొమ్ములు తగుటుకొంటేఁ గనక
తొట్టి వెల్లిఁ బోయినాస తొలఁగనీదు
॥మన॥
ఆహారము వెట్టితేను అట్టె విడుచు భూతము
ఆహారానకుఁ బోదెక్కు నట్టే ప్రాయము
యీహల శ్రీవేంకటేశుఁ డిట్టే కరుణించితేను
సాహాయమై వచ్చుఁ దానే సత్వగుణజ్ఞానము
॥మన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము