అధ్యాత్మ సంకీర్తన
రేకు: 157-2
సంపుటము: 2-270
రేకు: 157-2
సంపుటము: 2-270
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల ధీరతతో నేది మేలో తెలుసుకోరో | ॥పల్లవి॥ |
| అట్టే కొందరు మతము లన్నియు నేకమని పట్టవర్ధనము నెత్తిఁ బెట్టి చూపిరి జట్టిఁ గొందరు జీవులు జంగమే లింగముగాని- పుట్టుగెల్లా భస్మమని పూసుక చూపిరి | ॥వారి॥ |
| కొంద రేమియును లేదు కొట్టఁగొన లయమని అంది వట్టి లలాటశూన్యము చూపిరి కందువఁ గొందరు లక్ష్మీకాంతుఁ డంతరాత్మయని ముందే నామము శ్రీచూర్ణమునుఁ బెట్టి చూపిరి | ॥వారి॥ |
| చెలఁగి దిష్ట మిపుడు శ్రీవేంకటేశుఁడు అలమేలుమంగపతియై యున్నవాఁడు యిలవీర నీదాసుల కిట్టి భాగ్యరేఖలు వలసినవారికెల్లా వ్రాసినాఁడితఁడు | ॥వారి॥ |


