Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 158-3
సంపుటము: 2-277
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
ఆతురబందుగుఁడవు హరినారాయణ కృష్ణ
మా తలఁపెఱిఁగి నీవే మన్నించితి విపుడు
॥పల్లవి॥
గురుకుమారులఁ దెచ్చుకొని రక్షించినయట్లు
ధరలో గజరాజు నుద్ధరించినట్లు
గరిమఁ జెరలుమాన్పి కాంతలఁ బెండ్లాడినట్లు
సిరులతో మముఁ దెచ్చి సేవలు గైకొంటివి
॥ఆతు॥
నేరుపుననే రుకుమిణిదేవిఁ దెచ్చినయట్లు
ధీరత మునిపుత్రులఁ దెచ్చినయట్లు
భారమైన యహల్యశాపము మానిపినయట్లు
గారవించి మము నేఁడు కరుణఁ జూచితివి
॥ఆతు॥
లంక సాధించి సీతను లలిఁ జేకొనినయట్లు
తెంకికి ననిరుద్ధునిఁ దెచ్చినయట్లు
అంకెల శ్రీవేంకటేశ అట్టె నీదాసులమని
పొంకముగ మాపాలిటఁ బొసఁగి యేలితివి
॥ఆతు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము