అధ్యాత్మ సంకీర్తన
రేకు: 179-1
సంపుటము: 2-392
రేకు: 179-1
సంపుటము: 2-392
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| జీవుని కేకాలము శ్రీహరి చేరువబంధువుఁ డీతఁడు భావములోపలి పెరరేఁపకుఁడై భక్తి చేకొనును యీతఁడు | ॥పల్లవి॥ |
| పరమున నిహమున వెంటవెంటనే పాయని బంధువుఁడీతఁడు ధరఁ దనుఁదలచిఁన మారుకు మారై తా రక్షించును యీతఁడు విరివిగ నింద్రియవిషయభోగముల విందులు వెట్టును యీతఁడు వురుగతిఁ జిత్రపురూపుల దేహపుటుడుగర లిచ్చును యీతఁడు | ॥జీవు॥ |
| వడిఁ గలకాలము యిరువదియొక్కటవావుల బంధువుఁడీతఁడు బడిబడిఁ జైతన్యంబై యిన్నిటఁ బనులకు నొదగును యీతఁడు జడిగొని యేకాంతలోకాంతమై మతిసంగతి నాప్తుఁడీతఁడు పొడలుచు వైదికలౌకికముల నొకపొత్తునఁ గుడుచును యీతడు | ॥జీవు॥ |
| ఘననిధినిక్షేపములిచ్చేటి వుపకారపుబంధువుఁ డీతఁడు అనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీతఁడు ననిచిన శ్రీవేంకటేశ్వరుఁడై యిటు నాపాలఁగలుగు నీతఁడు పనివడి అరులను సూడువట్టి కడుఁ బగసాధించును యీతఁడు | ॥జీవు॥ |


