అధ్యాత్మ సంకీర్తన
రేకు: 179-2
సంపుటము: 2-393
రేకు: 179-2
సంపుటము: 2-393
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు | ॥పల్లవి॥ |
| కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు | ॥ఎంత॥ |
| సరి నెన్నుదురు(???) శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పంబవుదువు గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు | ॥ఎంత॥ |
| నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు | ॥ఎంత॥ |


