Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 179-4
సంపుటము: 2-395
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
హరి నీవే బుద్ధి చెప్పి యాదరించు నా మనసు
హరి నీవే నా యంతర్యామివి గాన
॥పల్లవి॥
వసముగాని కరివంటిది నామనసు
యెఁసగి సారెకు మదియించీఁ గాన
పొసఁగఁ బాదరసముఁబోలిన నామనసు
అసము దించక సదా అల్లాడీఁ గాన
॥హరి॥
వడి నడవుల చింకవంటిది నామనసు
బడిబడిఁ బట్టబట్ట బారీఁ గాన
కడఁగి విసరు పెనుగాలివంటిది మనసు
విడువక కన్నచోట విహరించీఁ గాన
॥హరి॥
వరుస నిండుజలధివంటిది నామనసు
వొరసి సర్వము లోనై వుండీఁ గాన
గరిమ శ్రీవేంకటేశ కావవే నామనసు
సరి నీయానతి నీకే శరణనీఁ గాక
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము