కీర్తనలు తూము నరసింహదాసు రామ! నీవాడసుమీ - యిక నన్ను - బాముల బెట్టకుమీ!

    
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

పంతువరాళి - చాపు (హిందోళ)
పల్లవి:
రామ! నీవాడసుమీ - యిక నన్ను - బాముల బెట్టకుమీ!
అనుపల్లవి:
రామ! నీవాడనై యేమని భువిలోన -
సామాన్యులతో నేనేమి దెల్పుకొందు!
చరణము(లు):
దిక్కు నీవె యంటిని - నా మదిలోన - మ్రొక్కి వేడుచుంటిని
ఒక్కసారైన నీచక్కనిమోము నా -
దిక్కుజూపవిది యెక్కడి చిత్రమొ
ఒరుల వేడనంటిని - నీ పాదముల - మఱువనే యంటిని
గరుడగమన మీకరుణ రావలెగాక -
మఱచియుండిన నాతరమా యాదివేల్ప
శక్తివంచన లేదుగా - నీ పైని యా - సక్తి తోడుత నుంటిగా
యుక్తినిజేసి నీభక్తులతోపాటు -
ముక్తిగతునిగా గానవ్యక్తుని జేయక
తిరము గాదు దేహము - వీడుటకునై - తరము గాదు మోహము
గురుతరశల్య సంగత మయిన దీనికై -
ముఱియుచు భక్తుల తెఱగు దెలియనైతి
మొర విన వేమిసేతు - నీ సంసార - భరము నే నెటుల ద్రోతు
గరిమతోడ తూము నరసింహుడను భక్త -
వరునితోడను నేమరకుండు రఘురామ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raama! niivaaDasumii - yika nannu - baamula beTTakumii! - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )