| కీర్తనలు | త్యాగరాజు | ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా? |
| పున్నాగవరాళి - చాపు |
| పల్లవి: |
| ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా? ॥ఇంత॥ |
| అను పల్లవి: |
| చింతనీయ! శ్రీరాఘవ! నిను మదిఁ జింతించు సుజనుల పూజించినవారి ॥కింత॥ |
| చరణము(లు): |
| మతిహీనులైన, నెమ్మతిలేనివారైన నతి పాపకృతులైన, నెన్నటికి స ద్గతిరానివా రైన, శ్రీరామ! శ్రుతి పురాణ నుత! ప్రతిలేని నిన్ను సన్నుతి సేయు భక్తుల జతఁగూడిన వారి ॥కింత॥ |
| సారెకు మాయ సంసారమందు చాల దూరినవారైనఁ, గామాదులు పూరిత మతులైన, సకల వేదసార! నిన్ను మన సార నమ్మిన సుధాపూర చిత్తుల సేవఁ గోరినవారి ॥కింత॥ |
| భర్మ చేల! నీదు మర్మముఁ దెలియని కర్మమార్గులైన, త్యాగరాజ నుత! ధర్మరహితులైన, లోకములు నిర్మించిన నీదు శర్మము స్మరియించు నిర్మల మతుల శర్మమొంచినవారి ॥కింత॥ |