| కీర్తనలు | త్యాగరాజు | ఇందుకా యీ తనువును బెంచిన |
| ముఖారి - చాపు |
| పల్లవి: |
| ఇందుకా యీ తనువును బెంచిన ॥దిందుకా॥ |
| చరణము(లు): |
| నీ సేవకులేక నీకు చెంతకురాక ఆశదాసుఁడై అటులిటుదిరుగు ॥టందుకా॥ |
| నిరతము నీ దృష్టి నే యార్జింపక ఒరుల భామలను ఓర జూపులు జూచు ॥టందుకా॥ |
| సారెకు నామస్మరణము జేయక యూరిమాట లెల్ల యూరక వదరు ॥టందుకా॥ |
| కరములతో పూజ గావింపక డాచి ధరలోన లేని దుర్దానములకు చాచు ॥టందుకా॥ |
| వారము నీ క్షేత్రవరముల చుట్టక భూరికి ముందుగా పారిపారి తిరుగు ॥టందుకా॥ |
| నీవాఁడని పేరు నిందు వహింపక నావాఁడని యముఁడు నవ్వుచు బాధించు ॥టందుకా॥ |
| రావయ్య శ్రీ త్యాగరాజ వినుత నిన్ను భావింపక ప్రొద్దు బారగొట్టుకొను ॥టందుకా॥ |