| కీర్తనలు | త్యాగరాజు | ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా |
| పున్నాగవరాళి - ఆది |
| పల్లవి: |
| ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా ॥ఇది॥ |
| అను పల్లవి: |
| పదిలముగఁ గొల్చిన - భావము వేరై యున్నది ॥ఇది॥ |
| చరణము(లు): |
| గతి లేనివారినిఁ గడతేర్చు దైవమని పతితపావన! నమ్మితి; శ్రీరామ! న్నతి వేగమున వేడితి; సంతతము స మ్మతిని నిన్నే కోరితి; శ్రీరామ! ॥ఇది॥ |
| పరమ దయాళువని, పాలన సేతువని సరగున, దేవరాయ! గొల్చిన నాపైఁ గరుణ లేదని కన్నీరాయె, జూచి నీ మనసు గరఁగ దెందుకురా? ఓ శ్రీరామ! ॥ఇది॥ |
| అన్నిట నిండవే, అద్భుతానందఘన! మన్నన సేయ రాదా? శ్రీరామ! నీ కెన్నరాని పుణ్యము రాదా? శ్రీత్యాగరాజ సన్నుత! నీ వాఁడను గాదా, శ్రీరామ! సీతారామ! ॥ఇది॥ |