| కీర్తనలు | త్యాగరాజు | దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో |
| గౌళ - ఆది |
| పల్లవి: |
| దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో దు.. |
| అను పల్లవి: |
| కడు దుర్విషయాకృష్టుఁడై గడియ గడియకు నిండారు దు.. |
| చరణము(లు): |
| శ్రీవనితాహృత్కుముదాబ్జావాఙ్మానసగోచర దు.. |
| సకలభూతములయందు నీవైయుండగ మదిలేకబోయిన దు.. |
| చిరుత ప్రాయమునాఁడె భజనామృత రసవిహీన కుతర్కుఁడైన దు.. |
| పర ధనములకొరకు నొరుల మదిని కరఁగ బలికి కడుపునింపఁ దిరిగినట్టి దు.. |
| తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి దు.. |
| తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుపదేశించి సంతసిల్లి స్వరలయంబు లెఱుఁగకను శిలాత్ములై సుభక్తులకు సమానమను దు.. |
| దృష్టికి సారంబగు లలనాసదనార్భకసేనామిత ధనాదులను దేవ దేవ నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన దు.. |
| చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ జేయక దుర్మదాంధ జనులఁ గోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయదురాసలను రోయలేక సతత మపరాధియై చపల చిత్తుఁడైన దు.. |
| మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మందలేక మదమత్సరకామలోభమోహములకు దాసుఁడై మోసబోతి గాక మొదటి కులజుఁడగుచు భువిని శూద్రుల పనులుసల్పుచును యుంటినిగాక నరాధములను గోరిసార హీనమతములను సాధింప తారుమారు దు.. |
| సతులకై కొన్నాళ్లాస్తికై సురులకై కొన్నాళ్లు ధన తతులకై దిరిగితినయ్య త్యాగరాజాప్త యిటువంటి దు.. |