| కీర్తనలు | త్యాగరాజు | నన్ను విడిచి కదలకురా - రామయ్య వదలకురా |
| రీతిగౌళ - చాపు |
| పల్లవి: |
| నన్ను విడిచి కదలకురా - రామయ్య వదలకురా ॥న॥ |
| అను పల్లవి: |
| నిన్నుబాసి యర నిమిషమోర్వనురా ॥న॥ |
| చరణము(లు): |
| అబ్ధిలో మునిగి శ్వాసమును బట్టి - యాణిముత్యము గన్నట్లాయె శ్రీరమణ ॥న॥ |
| తరముగాని యెండవేళ గల్ప - తరునీడ దొరికి నట్లాయె నీవేళ ॥న॥ |
| వసుధను ఖననము జేసి ధన - భాండ మబ్బినరీతి గనుగొంటి డాసి ॥న॥ |
| బాగుగ నన్నేలుకొమ్ము యల్ల - త్యాగరాజనుత తనువు నీ సొమ్ము ॥న॥ |