| కీర్తనలు | త్యాగరాజు | నిన్నే నెరనమ్మినాను నీరజాక్ష నను బ్రోవుము |
| ఆరభి - చాపు |
| పల్లవి: |
| నిన్నే నెరనమ్మినాను నీరజాక్ష నను బ్రోవుము ॥నిన్నే॥ |
| అను పల్లవి: |
| కన్నకన్న వారిని వేడు కొన్నాను ఫలములేదని నే ॥నిన్నే॥ |
| చరణము(లు): |
| దార తనయుల యుదర పూరణము సేయు కొఱకు దూరదేశములను సంచారము జేసి సారమింతెన లేక వేసారి యీ సం సార పారావారమందు గలుగు ఫలమీ దారియని తెలిసి రామ ॥నిన్నే॥ |
| సంచిత కర్మము తొల గించి నన్నే వేళ కరు ణించి బ్రోచు దైవము నీవనుచు యా చించి కొంచెపు నరుల నుతి యించను నావల్లను గాదంచును దుస్సంగతి చా లించి సంతతము రామ ॥నిన్నే॥ |
| భూతలమున నొక్కరి చేతి ధన మపహరించు ఘాతకులఁ బరలోక భీతియు లేని పాతకుల బట్టి యమ దూతలు గొట్టెడి వేళ బ్రోతునని పల్క నెవరి చేత గాదని శ్రీరామ ॥నిన్నే॥ |
| ఎందు నిండియుండు రఘు నందన వేగ నా మనసు నందు దలచిన యంతా నందమై తోచి సుందర వదన యోగి బృంద వందిత పాదార వింద యుగ త్యాగరాజ వందనీయ సంతతము ॥నిన్నే॥ |