| కీర్తనలు | త్యాగరాజు | ప్రొద్దుపోయెను శ్రీరాముని బూని భజింపవే మనసా |
| తోడి - చాపు |
| పల్లవి: |
| ప్రొద్దుపోయెను శ్రీరాముని బూని భజింపవే మనసా ॥ప్రొద్దు॥ |
| అను పల్లవి: |
| నిద్దుర చేత కొన్నాళ్ళు విషయ బుద్ధులచేత కొన్నాళ్ళు ఓమనసా ॥ప్రొద్దు॥ |
| చరణము(లు): |
| ప్రొద్దున లేచి త్రితాపములను నరుల బొగడి పొగడి కొన్నాళ్ళు పట్టి ఎద్దురీతి కన్న తావుల భుజియించి యేమి తెలియక కొన్నాళ్ళు ముద్దుగతోచు భవసాగరమున మునిగితేలుచు కొన్నాళ్ళు పద్దుమాలిన పామర జనులతో వెఱ్ఱి పలుకులాడుచు కొన్నాళ్ళు ఓ మనసా ॥ప్రొద్దు॥ |
| ముదమున ధన తనయాకారములు జూచి మదముచేత కొన్నాళ్ళు అందు చెదరినయంత శోకార్ణవగతుఁడై జాలిఁ జెందుటయు కొన్నాళ్ళు ఎదటిపచ్చజూచి తాళలేక తా నిలను దిరుగుట కొన్నాళ్ళు ముదిమది దప్పిన వృద్ధతనముచే ముందువెనుక తెలియకయె కొన్నాళ్ళు ॥ప్రొద్దు॥ |
| యాగాది కర్మములను జేయవలెనని యలసటచేత కొన్నాళ్ళు అందు రాగలోభములతో నపరాధముల జేసి రాజసమున కొన్నాళ్ళు బాగుగ నామకీర్తనములు సేయుట భాగ్యమనక కొన్నాళ్ళు త్యాగరాజనుతుఁడైన శ్రీరాముని తత్వము తెలియకయే కొన్నాళ్ళు ॥ప్రొద్దు॥ |