| కీర్తనలు | త్యాగరాజు | లాలి గుణశాలి వనమాలి సుహృదయన |
| కేదారగౌళ - జంప |
| పల్లవి: |
| లాలి గుణశాలి వనమాలి సుహృదయన లాలి మృదుతర హంస తూలికా శయన లాలి లాలయ్య లాలి ॥లా॥ |
| చరణము(లు): |
| ఇనవంశమందు జనియించిన ఘనాభ కనకమయచేల దినకర కోటి శోభ వనజనయనాక్రూరవరదాబ్జనాభ సనకాదినుత సకల సద్భక్త సులభ ॥లా॥ |
| కరకలితశరచాప ఖరశిరోహరణ అరుణాబ్జనిభచరణ అసురమదహరణ పురవైరివినుత సంపూర్ణశశివదన కరుణారసాక్ష గతకామమునిశరణ ॥లా॥ |
| పుడమివరద నాదుపూజ గైకొనుమా కడు నమ్మువారింట కలుగు శ్రీకరమా కడకంటిచూపు నీ కది చాల ఘనమా ఎడబాయజాల నన్నేలు కులధనమా ॥లా॥ |
| కోటిసూర్యప్రభల గేరు మంటపము చాటుగా నలంకరించినది నెలకొనుము సాటి దొరకని సాధు జనవంద్య విడెము మాటిమాటికి నొసఁగి మఱవక గొలుతుము ॥లా॥ |
| అందు మధ్యంబునను అపరంజితోను సుందరంబైన మంచము వేసినాను అందుపై జాజులను అమరపరిచాను అందమౌ నీ పాదయుగముఁ బట్టేను ॥లా॥ |
| అసమానసూర ముక్తావళులు మెఱయ అసమానగిరిమధ్య కుసుమములు గురియ బిసరుహభవాది సురబృందకోట్లరయ అసలైన బిరుదులిడి యూచెదను సదయ ॥లా॥ |
| భాగవతసేవలో బడలియున్నావు రాగవిరహిత నన్ను మఱవఁగఁ బొయ్యేవు బాగైన జనకజాభాగ్యమా నీవు త్యాగరాజుని నిండు దయచేసి బ్రోవు ॥లా॥ |