| కీర్తనలు | త్యాగరాజు | శ్రీరామదాస దాసోహం, నీరజ నేత్ర నీకేల సందేహం? |
| ధన్యాసి - చాపు |
| పల్లవి: |
| శ్రీరామదాస దాసోహం, నీరజ నేత్ర నీకేల సందేహము? ॥శ్రీరామ॥ |
| చరణము(లు): |
| గట్టు కానరాని గుంత రామ పట్టుకొని దాత నీ పేరు తెప్పంట ॥శ్రీరామ॥ |
| కామాదుల నక్కర బాధ తీర్ప రామయ్య నీచేత చక్రము లేదా ॥శ్రీరామ॥ |
| చలచిత్తమను నలలకు రామ చెలగు నీ వామ హస్తము వైరియగును ॥శ్రీరామ॥ |
| మదమత్సరములను గజములకు నీ పద కమలాంకుశ రేఖ వజ్రము ॥శ్రీరామ॥ |
| శోకాదులను పర్వతములకు నీ కరాంకిత రేఖవజ్ర చయములు ॥శ్రీరామ॥ |
| అహమను జడత్వ మణచి బ్రోవ సహజమౌ నీ చేతి శరములు లేవా ॥శ్రీరామ॥ |
| దుష్కర్మములను కొండలెగయసేయ నిష్కల్మష పవనజుడుండు సదయ ॥శ్రీరామ॥ |
| జనన మరణమను సుడిని నిల్ప ఘనమైన నీ యాజ్ఞ గాదను వడిని ॥శ్రీరామ॥ |
| జాతికొకరు కూడినారము ప్రీతి చేత దెలుసుకొంటిమి నామసారము ॥శ్రీరామ॥ |
| పన్నుగ భవ మతి ఘోరము రామ నిన్ను వినా అన్యదైవములను కోరము ॥శ్రీరామ॥ |
| వరగుణ రాజాధిరాజ రామ పరమపావన పాలిత త్యాగరాజ ॥శ్రీరామ॥ |