| కీర్తనలు | త్యాగరాజు | సంసారులైతే నేమయ్య, శిఖిపింఛావతంసు డెదుట నుండగ |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| సంసారులైతే నేమయ్య, శిఖిపింఛావతంసు డెదుట నుండగ ॥సంసారు॥ |
| అను పల్లవి: |
| హింసాదులెల్ల రోసి హంసాదులఁ గూడి ప్ర శంస జేయుచు నే ప్రొద్దు కంసారిని నమ్మువాడు ॥సంసారు॥ |
| చరణము(లు): |
| జ్ఞాన వైరాగ్యములు హీనమైనట్టి భవ కానమునఁ దిరుగు మానవుఁడు సదా ధ్యానయోగయుతుఁడై నీ నామము బల్కుచు నానా కర్మఫలము దానము జేయువారు ॥సంసారు॥ |
| క్రూరపు యోచనలు దూరుజేసి తన దారపుత్రులఁ బరిచారకుల జేసి సారరూపుని పాదసారస యుగముల సారె సారెకు మనసార పూజించువారు ॥సంసారు॥ |
| భాగవతులఁ గూడి భోగములెల్ల హరి కే గావింపుచు వీణాగానములతో నాగమచరుని శ్రీరాగమున బాడుచు త్యాగరాజనుతుని బాగుగ నమ్మువారు ॥సంసారు॥ |