| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 24. చల్లచల్లగా బండీ | |
| చల్లచల్లగా బండీ సాగనీయరా, మామ! చెళ్ళున కొరడా ఇసిరే సిత్రమేటిరా? | |
| ఎలపటెద్దు మందకొడిగ ఎనకెనకై పోతుంటే, దాపటెద్దు ముందరికే తరుముకుపోతానంటది సద్దుకుపోవేరా మన సంసారము సూశయినా! | |
| చల్లచల్లగా... | |
| నువ్వుచేల తొలిపూతల నవ్వుల నురగలలోబడి, ఎన్నెలలో చెట్ల నీడ లెగరజిమ్ముతా, బండి పుంతదారి ఇసకలలో పూపడవై పోవాలి | |
| చల్లచల్లగా... | |
| సూపులు దారెంటనిలిపి సోద్దెము మానర నాతో; పడుసుగిత్త లేమరితే బళ్ళగాడి దాటేస్తై; ఊసులాడదామంటే ఆశలేదురా కసింత | |
| చల్లచల్లగా... | |
| గడ్డివాము నీడలంట కలలుముసిరి కవ్విస్తే పొదసాటున కోకిలమ్మ పదమేదో అల్లుతుంటె మూగసూపుగా నడుమనె ఆగిపోద మనిపిస్తది! | |
| చల్లచల్లగా... | |
| ఎద్దులజత మెడగంటల ఏమితీపు లొలికినవో, కుదుపులోన ఏమరుపులు కదిలి ఓసరిల్లినవో, సిగ్గిడిసిన మనసులెవో మొగ్గతొడుగు తున్నయిరా | |
| చల్లచల్లగా... | |