| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 4. మొక్కజొన్న తోటలో | |
| సుక్కలన్ని కొండమీద సోకు జేసుకునే వేళ, పంటబోది వరిమడితో పకపక నవ్వేవేళ, సల్లగాలి తోటకంత సక్కలగిల్లి పెట్టువేళ, | |
| మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో, మంచెకాడ కలుసుకో; మరువకు మామయ్య. | |
| చీకటి మిణుగురు జోతుల చిటిలి చిల్లులడక మునే, సుద్దులరాగాలు చెవుల నిద్దరతీయక మునుపే; ఆకాశపుటొడిని తోట ఆవలింతగొనక మునే, | |
| పొద్దువాలుగంటనే పుంతదారి వెంటనే, సద్దుమణగనిచ్చి రా ముద్దులమామయ్య! | |
| గొడ్డుగోద మళ్ళేసే కుర్రకుంకలకు గానీ, కలుపుతీతలయి మళ్లే కన్నెపడుచులకు గానీ, బుగ్గమీస మొడివేసే భూకామందుకు గానీ, | |
| తోవకెదురు వస్తివా, దొంగచూపు చూస్తివా, తంటా మన యిద్దరికీ తప్పదు మామయ్య!! | |
| కంచెమీద గుమ్మడిపువు పొంచి పొంచి చూస్తాది; విరబారిన జొన్నపొట్ట వెకిలినవ్వు నవుతాది; తమలకుతీగెలు కాళ్ళకు తగిలి మొరాయిస్తాయి; | |
| చెదిరిపోకు మామయా, బెదిరిపోకు మామయా! సదురుకొ నీ పదునుగుండె సక్కని మామయ్య! | |
| పనలుకట్టి యొత్తి నన్ను పలకరించబోయినపుడు, చెరుకుతోట మలుపుకాడ చిటికవేసి నవ్వినపుడు, మోటబావి వెనక నాతొ మోటసరస మాడినపుడు | |
| కసిరితిట్టినాననీ, విసిరికొట్టినాననీ, చిన్నబోకు నలుగురిలో సిగ్గది మామయ్య. | |