| కవితలు | దాశరథి కవితలు | రుద్రవీణ |
| 01. మంగళగీతి | |
|
మంగళగీతి పాడెద హిమాచల శృంగ సరత్ సురాపగా భంగ తరంగ రంగముల పాదములూని నటించు తారకా లింగిత బాలచంద్రముని లీల తలన్ ధరియించినట్టి భ స్మాంగుని ఫాలనేత్రము నవాగ్ని కణమ్ముల జిమ్ముదారులన్. | |
|
కుంకుమ చిల్కరింతు నిదిగో! పరిగర్జిత మేఘ మాలికా పంకిల రోదసీ కుహరభాగ దివాంధ భయంకరార్భటీ సంకుల కాళరాత్రి తెరచాటున నాటన శాలవంటి ప్రా గంకమునన్ మదీయ ఘుసృణారుణ హస్త తలద్వయమ్మునన్. | |
|
వెచ్చని మొల్లపూలు కురిపింతును శైశిర శీతవాత ఘా తోచ్చలి తాతిశుష్క లతికోద్గత నగ్నతతో చెలంగు యీ గచ్చ పొదల్ గలట్టి వన కన్యక శూన్య ముఖాంగణమ్మునన్ పచ్చని మాధవ ప్రభుని బాహువు లెత్తిన పూల బుట్టతో | |
|
వెన్నెల కాగడాలకు ద్రవించెడి చీకటి కొండపైన కూ ర్చున్న అనంత తారకలు రొప్పుచు రోజుచు జారివచ్చి ఈ పున్నమనాటి చెంగలువ పూవులవోల్ వికసించెనో! యనన్ మిన్నులు దించి తెచ్చెదను మేచక వారిరుహాకరమ్ములన్. | |