| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 02. కాగడా |
| 02. కాగడా | |
| వెలిగించు కాగడా వెలిగించవోయి! ప్రళయరుద్రుని ఫాలభాగమ్మునందు అతని నిశాతశూలాగ్రమ్మునందు అతని నేత్రగోళాంతమ్ములందు జ్వలియించు శిఖిశిఖాజాలమ్ముతోడ వేడిగా వాడిగా వెరపుగొల్పేదిగా వెలిగించు కాగడా వెలిగించవోయి! | |
| రేయి విప్పిన నీలిరెక్కల నీడ అవనీనభోంతరం బార గ్రమ్మినది పులుగుగొంతుక మూగవోయిన వేళ గూట నుంచిన దివ్వె కొండెక్కు వేళ విడిన పూవులు రాలి పడిపోవు వేళ ప్రాత దన్నది యెల్ల పైకి తోడుచును వెలిగించు కాగడా వెలిగించవోయి! | |
| నెమరు వేయుట పశుత్వముపాడి, గాని సప్తసామ్రాజ్యముల్ స్థాపించుకొన్న పరరాజ్యముల పారుపత్తెమ్ము గొన్న పౌరుషమ్మున కది పరిపాటి గాదు ఎన్నెన్ని కల్పమ్ము లేగిన గాని ఆరని మారని యా ధ్రువజ్యోతి వెలిగించు కాగడా వెలిగించవోయి! | |
| అధికారదృప్తుల కర్థమత్తులకు భోగదాసిగ నున్న భూదేవికొరకు, చెక్కిన నెలరాల చెరసాల నడుమ వధ్యశిలావైభవం బిచ్చగించి దేవులాడుచునున్న దేవునికొరకు దారి తప్పిన బాటసారులకొరకు దారి గానని పేదవారలకొరకు వెలిగించు కాగడా వెలిగించవోయి! | |
| తొడిమవీడినపూవుత్రోవ చూడదు తీవ ధూళిరాలినపండుతో పోదు పాదపము గాలి గలసిన పాటకై పక్షి వెత పడదు తరగ విరిగిన మహోదధి తీసిపోవదు పశ్చిమాశామేఘపటలాంచలముల ముదిప్రొద్దు రేపటి యుదయమ్ముకొరకు దాచుకొన్న ప్రతాపరోచిర్లవాల వెలిగించు కాగడా వెలిగించవోయి! | |
| పూవు వీడినగాని పుట్టదు ఫలము ఫలము రాలక జనింపదు నవాంకురము దగ్ధదినైకచితాభస్మరాశి సుప్తి వీడెడి యుషస్సునకు పునాది ముదిశిశిర మ్మాకు చిదిమినపట్లు పూలకారుచివుళ్ళ పురిటిపొత్తిళ్ళు గతముకై తలపేల, క్షతి కేల వగపు అరణి మథించి యజ్ఞాగ్ని రగిల్చి వెలిగించు కాగడా వెలిగించవోయి! | |
| మంటికి మింటి కన్నింటికి మంటగా వెలిగించు కాగడా వెలిగించవోయి! | |