| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 05. నిరీక్షణము |
| 05. నిరీక్షణము | |
| అనిలతరంగమాలికలయందునఁ జల్వలఁ జల్లు తీయవా సన పసిగట్టి యంధతమసమ్ములు మూసిన యీ నిశీథమం దున ననుఁ జూడ నీవె దయతో నునురెక్కలఁ దాల్చి వత్తువం చు, నిటులు వాకిలిం దెరచి చూచుచునుంటిని వీథి సారెకున్ | |
| కురులను దువ్వి, పూల్ముడిచి, గొజ్జఁగిపూవుల లేమెరుంగు టం బరము ధరించి, గంధకలపమ్ముల మేన నలంది, కమ్మక స్తురితిలకమ్ము నెన్నుదుట సొంపుగ దిద్ది, సువర్ణభూషణో త్కరములఁ దాల్చి ద్వారసవిధమ్మున నిల్చితి వెచ్చ నూర్చుచున్ | |
| విచ్చినయట్టి బండిగురివెందపువుల్ గొనితెచ్చి మాలికల్ గ్రుచ్చితిఁ బూలకన్న నతికోమలమై భవచ్ఛరీరమే నొచ్చునొయంచుఁ జక్కఁగఁ గనుంగొని కమ్మని తమ్మి పుప్పొడి\న్ దెచ్చియె పాన్పుపైఁ బరచితి\న్ సకలమ్మును సిద్ధపెట్టితిన్ | |
| అలికిడి యేదియైన వినినంత గవాక్షమునుండి లేచి మే న్పులకలుదేరఁ, బాదములను న్దడబా టిగురొత్త, మారుతో చ్చలిత కదంబపల్లవము చాడ్పున నా యెద సంచలింప, న ల్గెలఁకుల వీథియెల్లఁ బరికింతుఁ జలింప నిశాంధకారముల్ | |
| నీ యనురాగగీతికల నీ పదసన్నిధిఁ గంఠ మెత్తి నేఁ దీయగ నీవు మెచ్చుకొను తీరునఁ బాడఁ బ్రదోషయామ మం దే యిటు మేలవించి శ్రుతిఁ దీర్చిన వల్లకి యర్ధయామినీ వాయుతరంగసంహతి నపశ్రుతు లీను విభిన్న తానమై | |
| కలువలతేనె లాని వలిగాడ్పు మదాననకీర్ణచూర్ణకుం తలములతో సయాటము లొనర్పఁగ నాచెవి నూఁదునేమొ నీ పొలఁకువయంచు నూర్పు లెగఁబోయుదుఁ బ్రాణములోని ప్రాణమై పొలిచిన వాని కేని దయపుట్టని దుర్విధి నాడిపోయుదున్ | |
| రేయి పదేపదే కనులరెప్పల స్వప్నపు నీలిక్రొందెరల్ నేయఁ దపించు నాయెదఁ జలించిన మ్రోఁతలె నీ పదస్వనం బో యని యూపి రాపి వినుచుంటిఁ జలత్తరుశాఖనీడ వా తాయనబింబితమ్మయి త్వదాగమనభ్రమ గొల్ప మాటికిన్ | |
| రావనుకొందుఁగాని యనురాగము ద్వారము మూయనీదు, దుః ఖావహమౌను గాని భవదాదరపాత్రములంచు వేషభూ షావళు లూడ్వ లే, నిటు నిరాశ యొకింత యొకింత యాశగా శ్రావణలక్ష్మినై నిలువఁ జాలక యుంటిని వెల్గునీడలన్ | |
| చీకటి గ్రమ్ముకొన్న వనసీమను బూవులు రాలు చప్పుడుల్ జోక దొరంగి రాల్పఁడు నెలుంగునఁ జక్కవపెంటి గూయు నా నాకరుణారవమ్ములు వినంబడ నాహృదయమ్ము దుర్నిమి త్తాకుల మౌను శంకఁ గొనినట్టి వనీమృగి గుండెపోలికన్ | |
| ప్రేమవిహీనమానసము రీతి విషాదపయోదధూమముల్ బ్రామిన యట్టి యీ భయదరాత్రి నిమేషపరాఙ్ముఖమ్ములౌ ప్రేమవిలీనదృష్టుల వివిక్తపథమ్మును జూచుకొంచు నో స్వామి యిఁకెంతసేపు గడపంగల నోయి! ముహూర్త కల్పముల్ | |