| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 48. పూజాప్రసూనములు |
| 48. పూజాప్రసూనములు | |
| రాలని పూలు కోసికొనిరమ్మని పంపితి వీవె యీ యుషః కాలమందు పెద్దయొడిగట్టి ననున్,` పవమానవీచికా జాలములందు నే వలపుజాడలఁ గట్టుచు వచ్చులోన నీ పూలవనమ్ము గుమ్మమును మూసిరి పిల్చినఁ బల్క రెవ్వరున్ | |
| ఈ పథమందు వచ్చు జను లెల్లరెగాదిగఁ నన్నుఁ జూచి లో లోపల నవ్వుచుండ, నెటులో నిలుచుంటిని వేఁగుచీఁకటిన్ మాపులువడ్డ లేఁతపొగమంచుతెరల్ పులకించిపో నుషః శ్రీపవనమ్ము లెక్కి విహరించెడు పూవులతావు లానుచున్ | |
| ఆ రవికాంతి నీలజలదావళిపైఁ బడ చిత్రవర్ణశో భారమణీయతల్ దివిని వ్రాలినపోలిక నీ ప్రభాతగం భీరసుగంధశీతలసమీరము నా మెయి సోకినంత వి ప్పారెను నా విషణ్ణహృదయాన నపూర్వవిముగ్ధభావముల్ | |
| వేసవిరేల వేణువనవీథులయం దలస ప్రచారముల్ చేసిన కమ్మతెమ్మెరల చిందులలో స్ఫురియించు గానవి న్యాసమువోలె మెల్లమెల నాచెవి సోకెను నీ నిరంతర వ్యాసితవిశ్వఘోషణరహస్యము దూరమునుండి పిల్పుగన్ | |
| కాలము వెళ్లఁబుచ్చి విధికాళులపైఁ దలమోపుకంటె నే నేల స్వతంత్రధర్మము వహింపఁగ రా దని తోట పెన్గడిన్ గేల స్పృశింప, వింటి నొక కేకను 'మాలిక గ్రుచ్చ నెంచు ప్రె మాలసు లీ వనిం జొర ననర్హులు వారల కందవీ పువుల్' | |