| కవితలు | కిన్నెరసాని పాటలు | కిన్నెర నడకలు |
| 3. కిన్నెర నడకలు |
|
కరిగింది కరిగింది కరిగింది కరిగింది కరిగి కిన్నెరసాని వరదలై పారింది తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది |
|
కదిలింది కదిలింది కదిలింది కదిదింది కదిలి కిన్నెరసాని వొదుగుల్లుపోయింది సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది |
|
నడచింది కడరాళ్ళు గడచింది పచ్చికల్ తడసి కిన్నెరసాని సుడులలో మొరసింది జడిసి కిన్నెరసాని కడలందు వొరిసింది సుడిసి కిన్నెరసాని జడలుగా కట్టింది |
|
కరగగా కరగగా కాంత కిన్నెరసాని తరగచాలుల మధ్య తళతళా మెరిసింది నురుసుపిండులతోడ బిరబిరా నడిచింది ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది |
|
కదలగా కదలగా కాంత కిన్నెరసాని పదువుకట్టిన లేళ్ళకదుపులా తోచింది కదలు తెల్లని పూలనదివోలె కదిలింది వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది |
|
నడవగా నడవగా నాతి కిన్నెరసాని తొడిమ యూడిన పూవు పడతిగా తోచింది కడుసిగ్గుపడు రాచకన్నెలా తోచింది బెడగుబోయిన రత్న పేటిలా తోచింది |
|
పతి రాయివలె మారి పడియున్న చోటునే పడతి కిన్నెరసాని విడలేక తిరిగింది ముగుద కిన్నెరసాని వగచెంది తిరిగింది వెలది కిన్నెరసాని గలగలా తిరిగింది |
|
తాను నదిగా నేల నైనా ననుచు లోన పూని కిన్నెరసాని పొగిలింది పొగిలింది ముక్త గీతికవోలె మ్రోగింది మ్రోగింది ఒకచోట నిలువలే కురికింది వురికింది |
|
ఏ వుపాయము చేత నైన మళ్ళీ తాను మనిసి కిన్నెరసాని నగుదామ యనిపించి ఆపలేనంత కోరికచేత విలపించి ముగుద కిన్నెరసాని మొరసింది మొరసింది |
|
తను వీడితే వోర్చు కొనలేడు కాబోలు బ్రతికుండగా యింత ప్రణయమ్ము కలదంచు తెలిసితే యింకెంత చెలిమివుండేదంచు తలపోసి తలపోసి సొలసె కిన్నెరసాని |
|
అటువంటి పతితోడి అటువంటి కాపురం బిటు చేసికొంటినం చెక్కడా లేనంత వగచెంది వగచెంది వనిత కిన్నెరసాని వనరింది వనరింది వనిత కిన్నెరసాని |
|
తుదకేమి చేయగా నెదవోక అలవోక పతి రాయిగా మారి పడియున్న గుట్టపై అతివ తన కెరటాల హస్తాలతో చుట్టి వెతపొంది వెతపొంది బిట్టుఘోషించింది |
|
మాటి మాటికి కొండ మాద్రిగా పడివున్న తన నీటుకాణ్ణి చేతుల కౌగిలిస్తుంది పలకవా యని మ్రోతపడి పల్కరిస్తుంది పతిగుట్టపై తాను వ్రాలి యేడుస్తుంది |
|
ఓనాథ ఓనాథ ఓనాథ ఓనాథ నాకుమల్లే నీవు నదివోలె పారరా జలముగా యిద్దరము కలిసి పోదామురా కెరటాలు కెరటాలు కౌగిలిద్దామురా |
|
ఓనాథ ఓనాథ ఓనాథ ఓనాథ నీయందు తప్పింక నేను చెయ్యను లేర ఆనపెట్టితి వేని అడుగుదాటను లేర ఇక జన్మలో కోపమింత పొందను లేర |
|
రార ఓహో నాథ రార ఓహో నాథ వెలది నీ కిన్నెరా కలగిపోయిందిరా నాతి నీ కిన్నెరా నలగిపోయిందిరా పడతి నీ కిన్నెరా బడలిపోయిందిరా |
|
ఓనాథ నీయందు నేను చేసిన తప్పు తిరిగి యెప్పటికైన తీర్చుకుంటానురా నీత్రోవ నీదిరా నాత్రోవ నాదిరా మరల నాతో నీవు మాటాడబోవురా |
|
పిలిచింది పిలిచింది పిలిచింది పిలిచింది పిలిచి కిన్నెరసాని పిలుచు టాపేసింది బడలి కిన్నెరసాని పడిపోయినట్లైంది తరుణి కిన్నెరసాని కెరటాలు తగ్గింది |
|
వనరింది వనరింది వనరి కిన్నెరసాని మండియారిన నిప్పుమాద్రిగా నారింది తనకర్మ మింతియేయని లోన ననుకుంది తన కింక పతితోడి తగులు లేదనుకుంది |
|
చేతులారా తాను చేసుకున్నా నాని యింతి కిన్నెరసాని యేడ్చినా యేడ్పులూ సుదతి కిన్నెరసాని చూపినా దుఃఖమూ అవికూడ జలములై ఆమెలో కలిసినై |
|
నీలిమబ్బుల బోలు నిడివి నీ చేతుల్లు నన్నింక కౌగిలించగరావు కాబోలు కడుప్రేమతో చేరగా తీవు కాబోలు నెమ్మదిగ నా యొడల్ నిమురవు కాబోలు |
|
నేను కోపము నంది నీ ప్రక్కనుండగా వలదన్నకొద్ది నాపదము లొత్తుచు నీవు తెలచి కౌగింటిలో తేర్చుకుంటూ నీవు నాఱొమ్ము తలచేర్చగా రావు కాబోలు |
|
తలిరాకువంటి మె త్తని యెఱ్ఱ పెదవితో తార్చి నా మోము నద్దగరావు కాబోలు నా యొడల్ మివుల నందపుకుప్ప యని చెప్పి ఎల్ల తావులను ముద్దిడరావు కాబోలు |
|
అని సన్న గొంతుతో వనరి కిన్నెరసాని రొద యడంగిన పావురాయి గొంతుకవోలె తనలోన తానేమొ మెలమెల్ల రొదచేసి కొనుచు పల్లపు నేలకును డిగ్గి పడిపోయె |
|
జలదేవతలు వచ్చి నెలత కిన్నెరసాని పదమంచు పదమంచు బలవంతపెట్టంగ మరిమరీ పతిచుట్టు తిరిగి కిన్నెరసాని వలవలా యేడ్చింది పలపలా కుందింది |
|
జలదేవతలు వచ్చి చలపెట్ట పతిగుట్ట విడలేక విడలేక పడతి కిన్నెరసాని చనలేక చనలేక చాన కిన్నెరసాని పోలేక పోలేక బాల కిన్నెరసాని |
|
జలదేవతలు వచ్చి చలపెట్ట పతిగుట్ట వదలగా లేక యా ముదిత కిన్నెరసాని తల్లి దగ్గరనుండి తనమెడకు పలుపోసి లాగగా బడ్డట్టి లేగలా సాగింది |
|
సాగింది సాగింది జాలుగా పారింది ఆవు పొదుగున పాలు ధారకట్టిన యట్లు వనదేవతలు నీళ్ళు వొలకబోసినయట్లు తల్లి చల్లని ప్రేమ వెల్లివారినయట్లు |
|
జాలుగా పారింది జలజలా పొంగింది లేతయెండలు దిశాళిని క్రమ్ముకొన్నట్లు పాలాట్రగడము పాతర తీసికొన్నట్లు ముద్దరాలిమనస్సు పొంగి వచ్చినయట్లు |
|
జలజలా పొంగింది బిలబిలా నడచింది పరికిణీ తొక్కాడు పదియేండ్ల కన్యలా చిన్నిగంతులువేయు తెల్లనాఁబెయ్యలా పసిపాప సెలవి వారిన బోసినవ్వులా |
|
నడిచింది నిడచింది నడిచి కిన్నెరసాని నడిచి యందాలు చందాలుగా నడిచింది గడియలోపల పెద్దకాల్వగా కట్టింది అడవితోగుల రాణి యన్నట్లు తోచింది |
|
ఏమి కిన్నెరసాని ఏమి కిన్నెరతోగు బంగారుతీగలో పానకమ్మైపోయె కొబ్బరిపాలు వాకలు కట్టినట్లయ్యె వెయ్యావులొకసారి పిదికినట్లైపోయె |
|
జలదేవతల వెంట సాగి కిన్నెరసాని తెలితారకల వెంట వెలుగులా తోచింది తలిరుపూవుల వెంట తావిలా తోచింది తెనుగుపాటల వెంట తీపిలా తోచింది |
|
వొయ్యారి నడలతో వచ్చు కిన్నెరసాని వనదేవతలు పూలు పై క్రుమ్మరించారు భూదేవతలు ఎదురుపోయి దీవించారు వాయుదేవతలు రమ్మని పాటపాడారు |
|
పాఱు కిన్నెరసాని పజ్జలందున నిల్చి కోకిలా తన గొంతుకొన విచ్చి పాడింది పికిలిపిట్టలు మేలిరకముగా కూసినై తెలుగుపిట్టలు వొళ్ళుతెలియక పాడినై |
|
ఎంతదూరముపోయె నంతదూరముదాక తెఱవ కిన్నెర వెన్కతిరిగి చూచుచె పోయె పడతి కిన్నెర తిరిగి పతిని చూచుచె పోయె నాతి కిన్నెర తిరిగి నాథు చూచుచె పోయె |
|
పతివంక చూచుచూ పడతి కిన్నెరసాని పోయేటివేళలో భూమి తనంతగా తోరమై విరియుచూ త్రోవగా చేసింది కెరటాలతో చొచ్చుకోదు కిన్నెరసాని |
|
బ్రతికి వున్నప్పుడూ అతివ కిన్నెరసాని ఎంత ఒయ్యారియో ఎంత నెమ్మదిచానొ అంత ఒయ్యారమ్ము అడుగడుగుపోయింది అంత యిల్లాలి నెమ్మదితనము చూపింది |