| ౨-వ స్థలము. చెఱువుగట్టుతోట. |
| (అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వెంకమ్మ, యితరులూ.) |
| అగ్ని |
గాడిదెకొడుకుని మాచెడ్డదెబ్బలు కొట్టేశాను; యేనుగులూ గుఱ్ఱాలూ తెచ్చాను వీడిశ్రాద్ధం మీదికి! తోవఖర్చయినా వొకదమ్మిడీ ఇయ్యడష. |
| వెంకమ్మ |
మనప్రాలుబ్ధం - నేన్నోచిన నోవుఁలు యిలా వుండగా, మరోలా యలా అవుతుంది? యీ సమ్మంధం వొద్దనిపోరితే విన్నారూ? నేను భయపడుతూనే వున్నాను. బయల్దేరేటప్పుడు పిల్లి యెదురుగుండా వొచ్చింది. |
| అగ్ని |
పింజారీ! వూరుకో - ఆడముండల కేంతెలుసును? అన్నగారూ, క్రిమినల్కేసు తావడానికి అవకాశంవుంటుందా? మాదగ్గిర అయ్యవారూ ఒకాయన వున్నారు. ఆయనకి లా బోగట్టా మా బాగాతెలుసును. ఆయన్నికూడా సలహాచేదాం. |
| రామ |
కోర్టు వ్యవహారాల్లో ఆరితీరిన మీకు ఒహడు సలహాయివ్వాలండీ? స్థలజ్ఞుణ్ణి గనక సాక్ష్యం గీక్ష్యం తేవడానికి నేను సాయంచేస్తానన్నానుగానీ, అయ్యవార్లూ గియ్యవార్లూ మీకూ నాకూ సలహా చెప్పేపాటివాళ్లా? గుంటకక్కగట్లు రెండు యింగిలీషుముక్కలు చదువుకున్నారు గనుక ముక్కస్యముక్కార్థః అని తర్జుమాలుమట్టుకు చేస్తారు; గాని యేదయినా యెత్తుయెత్తావఁంటే, తమలాంటి యోధులు యెత్తాలి, నాలాంటి నియ్యోగపాడు నడిపించాలి. క్రిమినలుకి అవకాశంవుందా అని అడుగుతా రేవిఁటి? మీకు తెలియదా యేవిఁటి! - అటుపైని సులభసాధ్యంగా మూడు నాలుగువేలు డా`మేజీకూడా సివిల్లో లాగేస్తారు. |
| అగ్ని |
అదే, నా ఆలోచన. |
| రామ |
తీరిపాయె; మళ్లీ యిహ సలహాకేవుఁంది. వెంటనే వెళ్లి ముక్క తగిలించేదాం. ఖర్చులికి సొమ్ముపట్టుకుని బయలుదేరండి. |
| అగ్ని |
నాదగ్గిర దమ్మిడీ లేదు; యేమి సాధనం? యీ గాడిదెకొడుకు రూపాయలిస్తాడని నమ్మి, నేనేమీ తేలేదు. |
| రామ |
యింటికివెళ్లి లెఖ్కపట్టుకు వొచ్చేటప్పటికి పుణ్యకాలం మించిపోతుంది. "శుభస్యశీఘ్రం" అన్నాడు - మీఆలోచనేవిఁటి? |
| అగ్ని |
యిదేదో అయితేనేగాని యింటిమొహం చూసేదిలేదు. మా అమ్మి సరుకేదయినా యీ వూళ్లో తాకట్టు పెడదాం. |
| రామ |
అయితే పట్టుకురండి; పోలిశెట్టి దగ్గిరతాకట్టు పెడదాం; పోలిశెట్టిని మనం కొంచం మంచి చేసుకోవడం ఆవస్యకం. మీరు లుబ్ధావధాన్లుని కొట్టినప్పుడు- పోలిశెట్టి వున్నాడు గనక, లుబ్ధావధాన్లు మీమీద ఛార్జిచేసినప్పుడు, పోలిశెట్టిని తప్పకుండా సాక్ష్యం వేస్తాడు. శెట్టిని మనం విడతియ్యడం జరూరు- యేవఁంటారు? |
| అగ్ని |
మీసలహా మా బాగావుంది. నాకూ అదే భయవేఁస్తూంది. |
| రామ |
చూశారా, ప్ర`తివాడికీ సలహాచెప్పడం చాతౌతుందండీ? అందులో యీ యింగిలీషు చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే, కేసులే తేవొద్దంటారు. దొంగసాక్ష్యాలు తా`వొద్దంటారు. వాళ్లసొమ్మేం పోయింది? యే మాలకూడూ లేకపోతే కేసులు గెలవడం యలాగ? |
| అగ్ని |
మా అయ్యవారు మట్టుకు మంచి బుద్ధిమంతుడూ, తెలివైనవాడూ నండి- కోర్టు వ్యవహారాలలో అతనికి తెలియని సంగతిలేదండి. అంతబుద్ధిమంతుణ్ణి నేను యక్కడా చూడలేదు. ఆయన్ని చూస్తే మీరూ అలాగే అంటారు. |
| రామ |
యెంతబుద్ధిమంతుడైనా మీకొహడు సలహా చెప్పేవాడున్నాడండీ? (చెవులో) మరోమాట- మీ అయ్యవారు గిరీశంగాడు కాడండీ? వాడు లుబ్ధావధాన్లు పింతల్లికొడుకుగదా? మీకా వాడు, యీ కేసుల్లో సరైన సలహా చెబుతాడు? |
| అగ్ని |
అవునండోయి! |
| రామ |
నియ్యోగపాణ్ణి - నా మాట కొంచం ఖాతరీ చెయ్యండి. గనక, ఆ అయ్యవార్నితోడిచ్చి, పిల్లల్ని యింటికి పంపించెయ్యండి. యెకాయెకిని మనం తక్షణం వెళ్లిపోయి, లుబ్ధావధాన్లుకన్న ముందు ముక్క తగిలించెయ్యాలి. యేదో ఓసరుకు వేగిరం పట్టుకురండి. |
| అగ్ని |
యేదీ, అమ్మిని యిలా పిలువు. |
| వెంకమ్మ |
అమ్మేది చెప్మా? బద్ధకించి బండిలో పడుకుంది కాబోలు. పిలువమ్మా. |
| అగ్ని |
మనకి డా`మేజీ దిట్టంగా వొస్తుందా? |
| రామ |
వొస్తుందంటే, అలాగ యిలాగానా? |
| ఒకడు |
అమ్మన్నగారిబండీ యక్కడా కనపడదు; బండీ వెనకపడిపోయింది కాబోలు. |
| వెంకమ్మ |
అడుగో అబ్బివున్నాడే? వీడెలా వొచ్చాడు? అబ్బీ నువ్వు అక్కయ్య బండిలో కూచోలేదురా? |
| వెంకటేశం |
లేదు. నేను యేనుగెక్కా`ను. |
| అగ్ని |
దొంగగాడిద`కొడకా అయ్యవారేడ్రా? |
| వెంకటేశం |
యెక్కడా కనపడ్డు. |
| అగ్ని |
గుఱ్ఱం వొచ్చిందా? గుఱ్ఱపాడేడీ? |
| వెంకటేశం |
గుఱ్ఱపాడు చెప్పాడు- |
| అగ్ని |
యేవిఁట్రా`, వెధవా, చెప్పాడూ? |
| వెంకటేశం |
మా`ష్టరూ- రాత్రి- |
| అగ్ని |
నోటంటమాట పెగల్దేం? |
| వెంకటేశం |
గుఱ్ఱందిగి- బండీయెక్కా`ట్ట. |
| వెంకమ్మ |
అయ్యో దాన్ని లేవదీసుకు పోలేదుగద? |
| దగ్గిరనున్నవారు |
ఆఁ! ఆఁ! |
| వెంకమ్మ |
కొంప ములిగిపోయింది, మరేవిఁటి! |
| (చతికిలబడును.) |
| అగ్ని |
(కోపముచేతవణుకుచు) అయ్యవారు పకీరుముండని లేవతీసుకు పోయాడూ? నగలపెట్టె? నాకోర్టుకాగితాలో! |
| వెంకటేశం |
అక్కయ్యపెట్లో నాపుస్తకాలుకూడా పె`ట్టాను. |
| అగ్ని |
దొంగగాడిదె కొడకా! నువ్వే వాణ్ణి యింట్లోపెట్టా`వు. రవంత ఆచోకీ తెలిసిందికాదు. దొంగవెధవని చంపేసిపోదును. గాడిదెకొడుకును అమాంతంగా పాతిపెట్టేదును. |
| రామ |
(దగ్గిరకువచ్చి) అయ్యవారు మహా దొడ్డవాడని చెప్పారే? యేమి యెత్తుకు పోయినాడేమిటండి? |
| అగ్ని |
యేవిఁ యెత్తుకుపోయినాడా? నీశ్రాద్ధం యెత్తుకుపోయినాడు. పకీరుముండని యెత్తుకు పోయినాడు. యీ గాడిద`కొడుకు యింగిలీషు చదువు కొంపముంచింది. |
| (వెంకటేశం జుత్తుపట్టుకుని కొట్టబోవుచుండగా తెరదించవలెను.) |