| ౪-వ స్థలము. వీధి. |
| (అగ్నిహోత్రావధాన్లు, నాయడు ప్రవేశింతురు.) |
| అగ్ని |
అషైతే కేసు మానుకొమ్మంఛారూ? |
| నాయడు |
లేకపోతే మీకు చాలా వుపద్రవం సంభవిస్తుంది. ఆ యింగిలీషు వకీలు అంతా పాడుచేశాడు. |
| అగ్ని |
అయితే రావఁప్పంతులు వుడాయించేసినట్టేనా? |
| నాయడు |
అందుకు సందేహవేఁవిఁటి? |
| అగ్ని |
నాకడియం, పట్టుకుపోయి తాకట్టుపెట్టా`డు? |
| నాయడు |
దానికి నీళ్లధారే. |
| అగ్ని |
అయ్యో! ఆకడియం మాతాతనాటిది. మీరు మొన్నదిడ్డీతోవంట వొచ్చారే, ఆ సాందాని యింట్లో తాకట్టుపెట్టా`డు. |
| నాయ |
రామ! రామ! ఆసరుకు దానిదగ్గిర వుంచేలేదు. మీది మిక్కిలి దానితాలూకుకంటె వకటి వాడే తీసుకుపోయి యక్కడో తాకట్టుపెట్టా`డు. ఆ తాగుబోతు మీకెలా దొరికాడు? |
| అగ్ని |
రావఁప్పంతులు తాగుఛాడా? |
| నాయ |
మరి కడియం, కంటెకూడా తాగేశాడుకాడా? |
| అగ్ని |
వీడిసిగతరగా! |
| నాయ |
అవునుగాని, మీమీద పోర్జరి కేసు ఖణాయించకుండా డిప్టీ కలక్టరుగారితో సిఫార్సు చేశానుగదా, నాకేమిస్తారు? |
| అగ్ని |
యేవిఁచ్చేది? నాభి కొనుక్కోడానికి దమ్మిడీ అయినా నాదగ్గిరలేదు. వూరికిచేరితేగాని డబ్బుపెగల్దు. |
| నాయ |
పోనియ్యండి. ఒక ప్రోమిసరీనోటు రాయండి; రూపాయలు యిప్పిస్తాను. |
| అగ్ని |
నా ప్రాణంపోతే నోటురాయను. అప్పుపత్రం రాయనని మాతండ్రి చచ్చిపోయేటప్పుడు నాచేత ప్రమాణంచేయించాడు. |
| నాయ |
అయితే మీతోకూడా మీవూరువస్తాను - వకబండెడు ధాన్యం యివ్వండి. |
| అగ్ని |
డబ్బూ, దినుస్సూకూడా వొకీళ్లనెత్తినికొడితే, యేటికేడాదీ బతకడం యలాగు? రెండుపుట్లు మిరపకాయలిస్తాను. |
| నాయ |
అదైనా యెంతకాదు. ఖరారేనా? |
| అగ్ని |
అగ్నిహోత్రావధాన్లు, అన్నమాట తప్పుఛాడా? లుబ్ధావధాన్లు నన్ను పకీర్నిచేశాడు - వాడికి సిక్షకాదేం? |
| నాయ |
అవునుగాని, సౌజన్యారావు పంతులుగారు అతడికి సాయం చేస్తున్నారు. అధికార్లంతా ఆపంతులుమాట వింటారు. |
| అగ్ని |
ఆపంతులు అవుధాన్లుకూతుర్ని పెళ్లా`డఛాడా యేమిషి? |
| నాయ |
ఆయన ప్రాలుబ్ధం, దాన్ని పెళ్లాడతాడా? |
| అగ్ని |
మరియెందుకు, లుబ్ధావుధాన్లు మీదపడి యేడుస్తాడు? |
| నాయ |
సౌజన్యారావు పంతులుగారు మహాదొడ్డవారు. కోట్లలో యెన్నవలిసిన మనుషులు. ఆపదలోవున్న యెవరికైనా ఆయ్న ఉపకారం చెయ్యవలసినవారే! |
| అగ్ని |
అషైతే, వెధవముండని పెళ్లాడిన చావాటుపీనుగును వెనకేసుకుని, నాపీక యెందుకు నొక్కుచున్నాడు?- అడుగో ఆ గాడిదకొడుకు! |
| (గిరీశం తొందరగా ప్రవేశించును. అగ్నిహోత్రావధాన్లు పక్కనుంచి గిరీశం మీదపడును. గిరీశం తప్పించుకుని కిందికిజారి, అగ్నిహోత్రావధాన్లు కాళ్లుబట్టిలాగి "మావఁగారికి నమస్కారం" అని పరుగుచ్చుకొనును. అగ్నిహోత్రావధాన్లు కిందపడును.) |
| నాయ |
అల్లుడుగారా యేవిఁటండి? (లేవదీసి వొళ్లుదులుపును.) |
| అగ్ని |
వీడిశ్రాద్ధం చెట్టుకిందబెట్టా! యేడీ, వెధవని చంపేస్తాను? |
| నాయ |
అల్లుణ్ణి హతవాఁరిస్తే, కూతురు డబ్బిల్ వెధవౌతుంది. శాంతించండి. |
| అగ్ని |
నీయింట కోడిగాల్చా! |
| నాయ |
అమోఘాశీర్వచనము! పదండి. |