విన్నపములు భవానీశంకర విన్నపములు  

భవానీశంకర విన్నపములు
06

విశ్వేశ్వరా! తిర్యగ్జాతులు మొదలైన యజ్ఞానజంతువులు సత్కర్మంబు లెఱుంగకుండం జేసి యవి పుణ్యపాపంబులం బొరయవు. సకలజీవులయందు దుర్లభంబైన మానుషజన్మంబు ధరియించునప్పు డేజాతిజీవుండైన నేమి? అపాత్రంబైన ఆయసంబు పరుసంబు సోకి నిజవర్ణంబు విడిచి పవిత్రంబగు సువర్ణంబైన తెఱంగున, నుపనయనరూపంబునం బంచశిఖయజ్ఞోపవీతదండాజినంబులు మొదలైన మీస్వరూపచిహ్నంబులు ధరియించి త్రిమూర్త్యాత్మకవరేణ్యంబైన మీనామాంకితంబు వహించిన గాయత్రిమంతంబు స్మరియించి పావనంబైన ద్విజాతుండై సర్వవర్ణోత్కృష్టుండై గరిష్టుం డౌనఁట. ఇంక నఖిలజగద్గేయగుణుండవైన సర్వోత్తము మి మ్మాశ్రయించి మీయందు భక్తిపరాయణుండైన యతండు సర్వదోషఘ్నుండై పునరావిర్భావరహితుండై సారూప్యంబు ధరియించి శాశ్వతానందైకసద్గతియైన మీసాన్నిధ్యంబు నొందుట యరుదే? మున్ను మిమ్ము పూజించిన విభూతిరుద్రాక్షాది శివలాంఛనంబులు ధరియించి బ్రహ్మేంద్రాది సర్వగీర్వాణమునిగణంబు లత్యుత్కటంబైన మహామహిమంబు గని జన్మసాఫల్యంబు వడసిరి. నాకు వారి సామర్థ్యంబు దుర్లభం బగుటం జేసి నానేర్చుకొలంది విజ్ఞాపనం బొనర్చెద. ఇచ్ఛావిహారుండవై నాకూర్చిన యుపపాతక మహాపాతకానేక నీరంధ్రబంధురబలాహకనిర్దళన ప్రచండప్రళయసమయమహామారుతంబైన మీస్మరణ నా కొసంగి నన్నుం గటాక్షించి సుగతి నొసంగి సంరక్షింపవే! భవానీమనోహరా!

భవానీశంకర విన్నపములు
07

AndhraBharati AMdhra bhArati - bhavanISaMkara vinnapamulu - bhavAnImanOhara vinnapamulu - bhavAnimanOhara vachanamulu - telugu andhra tenugu ( telugu andhra )