| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
07
వ్యోమకేశా! నాజన్మించినదాదిగా నెన్నండును దానధర్మోపకారాది కృత్యంబులు స్వప్నప్రాయంబుననైన నెఱుంగక నిత్యనైమిత్తికాచారకర్మానుష్ఠానంబులు సూచ్యగ్రప్రమాణంబైన నడపినయవి లేవు. అతిథిసత్కారాభ్యాగతపూజ లొకనాఁడైనం జేసి యెఱుంగ. ఉపవాసాది వ్రతచర్యలయం దుండనైతి. అన్యవధూపరిరంభణసంభ్రమ విజృంభమాణసంరంభంబైన మనస్సున సిగ్గెఱుంగక విహరించితి. బుధజనసాధుతిరస్కారంబైన దుష్ప్రలాపంబు లనేకంబులు నోట వెడలె. పరాన్నపరిగ్రహప్రముఖ ప్రముదితరసజ్ఞాదైన్యం బేమని విన్నవింతు? ధనధాన్యాంబరాచరణాది వస్తుకాంక్షాపరిభ్రమ చేయ మాన. నేత్రేంద్రియంబుల కోర్కెలు దీర్ప నే నసమర్థుండ. నిజదేహభరణనిమిత్తాంతరంగక్లేశప్రశాంతికై యధమాధముల నాశ్రయించి యాచించితి. ఇంక ననర్థజీవుండనైన నాకుం దరణోపాయంబెద్ది? భవదంఘ్రిసరోరుహచింతనక్రియాలోలుండనై ప్రాయశ్చిత్తంబు వడసి యజ్ఞానపటలచటులాంధకారాపహరణ తరణికిరణాయమానంబగు మీస్మరణవలన మహాపాతకహతం బొనర్చెద. ఇహపరసుఖప్రదాతవై నన్నుం గటాక్షించి సుగతి యొసంగి రక్షింపవే! భవానీమనోహరా!