| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
08
కపర్దీ! నామనంబున నతిరహస్యంబైన విజ్ఞాపనం బొకటి నీకుం జేయం బొడముచున్నది. న న్ననాదరణ చేయక చిత్తగింపవలయు. ఎట్లంటివేని మీశుభలాంఛనంబులైన విభూతిరుద్రాక్షలును, భవదీయసత్యరూపంబైన పంచాక్షరీమహామంత్రంబును, స్వస్తిప్రదంబైన మీపుణ్యనామస్మరణయు, నాచేసిన పాతకంబు లన్నింటిని బాఱఁద్రోలి యధికక్రోధావేశనిర్దయోపేత చండప్రచండపరేతరాడ్భయధ్వంసంబు గావించి నాభయంబు దీర్చి నన్నుం దమవెనుక నిడుకొని యేరీతి రక్షింపఁ గడంగునో తత్సామర్థ్యంబు చూచెదఁ గాక యని మనంబున లేశంబును గొంకక లోకంబున నెవ్వరుం జేయరాని దుష్కర్మంబు లెన్ని గల వన్నియు నేన చేసి, నాహృదయకమలంబునకు నిస్సందేహంబుగ భక్తపరిపాలనాభిమానంబు వహించి నాచేసిన సర్వాపరాధంబులు సహించి నిష్కళంకంబైన భవత్పాదాంభోజసేవావియద్వాహినీ తోయావగాహనంబునం బాపపంకప్రక్షాళనం బొనర్చి పునీతుండనై యుండఁ గటాక్షించి యిహపరసుఖప్రదాతవై నన్నుం గటాక్షించి సుగతి యొసంగి రక్షింపవే! భవానీమనోహరా!