| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
09
వృషభవాహనా! మీధైర్యసాహసపరాక్రమంబులు మనంబునఁ దలంప నిత్యంబును గ్రొత్తలై తోచుచున్నయవి. ఎట్లంటివేని యఖిలసుపర్వశర్వరీచరులు సుధారసాస్వాదనం బొనర్పం బూని యభ్రంకషరంగదుత్తుంగ తరంగోపేతంబై ఘుమఘుమార్భటీరవంబుల నపారంబైన గంభీరపారావారంబున మంథరకుధరంబు మంథదండంబుగాఁ బాపరేనిం ద్రాఁగా బట్టుపట్టి భుజావిజృంభమాణసంరంభం బొనర్ప సవ్యాపసవ్యంబుగా దిర్దిరం ద్రిప్ప గుభులుగుభులనం భుగభుగం బొగ లెగయుచు గడలి యుడుకం బుడమి వడవడ వణంక నెడతెగని పిడుగుల కైవడి బెడిదంబై యుడుగని మిణుగురు లుడుపథంబున కెగసి భూర్భువస్సువరాది చతుర్దశభువనంబులం జుట్టుకొని మండుచుఁ జరాచరజంతుకోట్లతోడం గూడ నజాండంబున కంతరాయం బాపాదించి మహావిషం బావిర్భవింప, దేవదానవసమూహంబు లొక్కుమ్మడి జడియ, నజుండు మొఱవెట్టుచుం బాఱి కైలాసద్వారంబునం గేకలు వెట్ట, నీ వప్పుడు శరణాగతవత్సలుండవై యావిషం బుపసంహరింపఁ గడంగునెడ తద్విషానలోద్రేకంబువలన నీకుం గీడు రాకుండఁ బ్రజాపతులు “శంకరాయ శుభం భవతు” అనఁ జతుర్ముఖుండు “స్వస్తి ర్భవతు మృత్యుంజయాయ” యని జయమంగళసూత్రంబు హారిద్రోపేత నూతనదృఢసూత్రంబునఁ బదిలపఱుప నహంకారపూరితంబై పెచ్చుపెఱిగి వచ్చు విషానలంబున కెదురై ‘పోకు పోకు’ మని యదల్చుచు గుదియం బట్టి పడవైచి గడిగా నెడమకుడి నక్కించి గర్భగోళభువనంబులు గాలకుండఁ బెదవులు సోఁకకుండఁ గంఠంబునం గుదురుపఱిచి యెప్పటియట్ల స్థావరజంగమాదికంబైన విశ్వంబు గాచిన జగదేకరక్షకునకు నన్నుం గటాక్షించు టరుదె? కరుణచే మనోవాక్కాయంబులను జేసిన న్యూనాతిరిక్తంబులు దలంపక నన్నుం గటాక్షించి యఖిలదుష్కృతవిముక్తుంగాఁ జేసి సుగతి నొసంగి రక్షింపవే! భవానీమనోహరా!