విన్నపములు భవానీశంకర విన్నపములు  

భవానీశంకర విన్నపములు
10

జగదాధారా! నిన్ను గొందఱు మృత్పాషాణలింగంబుగా నొనర్చి పూజించు టొక్కవిడంబంబై తోఁచుచున్నయది. ఎట్లంటివేని యష్టమూర్తులం జిత్కళాపరిపూర్ణుండవై బ్రహ్మాండపిండంబు లంతర్భేదంబు లేర్పడక పిపీలికాది బ్రహ్మపర్యంతంబు సచరాచరకమలభవాండంబు లంతర్బాహ్యంబులం బట్టుచాలక సర్వభూతాంతర్యామివై తిలబీజమాత్రంబైన నెడలేకుండుటం జేసి నీవు గాని దొకశరీరంబు లేదు; గావున లింగాకారంబు వేఱ కలదె? పంకనిర్మగ్నం బయ్యును గర్దమరహితంబై వెలుంగు కుమ్మరిపురుగు చందంబున కర్మంబులం బొరయక యఖిలభువనజంతుహృదయంబుల వసియించు జగదాకారుండవైన నిన్ను భజియించుచు “పూజాకోటిసమం స్తోత్రం స్తోత్రకోటిసమం జపః, జపకోటిసమం ధ్యానం ధ్యానకోటి ర్మనోలయం” అను వచనంబు గలదు. కావున నంతర్భావంబున నిన్ను మనఃపీఠంబునందు నిల్పి నేత్రేంద్రియంబులం బంధించి చిత్తం బేమియుఁ బరాయత్తంబు గానీయక షోడశోపచారపూజల మనఃపూజ యొనర్చి మిమ్ము భజియింపుచు నాత్మారాముండై యున్న నంతియ చాలు. పశుప్రాయుండనై యున్న నాకు దినంబున నొకఘటికామాత్రంబైన మనఃపూజ గల్గునట్లు కటాక్షించి దుష్కార్యమహార్ణవ సముత్తరణైకమంత్రంబైన పంచాక్షరి నాహృదయంబునఁ బదిలపఱచి యిహపరసుఖం బాపాదించి సుగతి యొసంగి నన్నుం గటాక్షించి రక్షింపవే! భవానీమనోహరా!

భవానీశంకర విన్నపములు
11

AndhraBharati AMdhra bhArati - bhavanISaMkara vinnapamulu - bhavAnImanOhara vinnapamulu - bhavAnimanOhara vachanamulu - telugu andhra tenugu ( telugu andhra )