| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
11
వ్యాఘ్రచర్మాంబరా! నీవు సాధింపఁదలంచిన యత్నంబున కసాధ్యం బెద్దియైనం గలదే? ఎట్లంటివేని తొల్లి యంధకాసురవిద్యున్నామకాది రక్షోరాజత్రితయంబు వరలబ్ధకాములై పరిఘాకారహర్మ్యగేహ వనవాపీకూపతటాకసహితంబైన కామగమనపురత్రితయంబు వడసి భూనభోంతరాళంబున విహరించుచు, నొక్కొక్కతఱి మహాస్థలంబునకు డిగ్గి గోబ్రాహ్మణమునిసాధుపతివ్రతాజనంబుల కుపద్రవంబు సేయుచు, నొక్కొక్కతఱి నాకంబున కెగసి గీర్వాణులం బట్టి బరిమార్చుచు దిక్పతుల పట్టణము లట్టిట్టుచేసి వాలాయ మొనర్చుచు, గరుడగంధర్వ కిన్నరకింపురుష గుహ్యకచారణ సాధ్యసిద్ధవిద్యాధరాదులం గూడి నిరంతరసంగ్రామం బొనర్చుచు రణంబున నీల్గిన రక్కసుల రసకూపంబునం బడవైచి క్రమ్మఱ బ్రతికించి మహాఘోరయుద్ధంబు సేయుచు నంతరిక్షంబులఁ బురంబులతోడనే యిచ్ఛావిహారు లగుచు ముజ్జగంబులకు బాధ యొనర్ప, నిర్జరులు వెఱచి నిర్వహింప నోపక మొఱవెట్టుచుఁ దరణోపాయంబు చింతించి నిన్నాశ్రయింప, నప్పు డిందిరాకాంతుండు గోరూపంబును గైకొని క్రీడారామంబుల మెఱయుచు నిశాచరుల రసకూపంబునఁ బడి నీరసంబుగాఁ ద్రావి తదాకారంబు లుపసంహరించి విష్ణుండు క్రవ్యభుగ్వనితల పాతివ్రత్యభంగంబు గాక తదీయసాధనంబులతో సమరంబునఁ బడరని యూహించి యొక్క కైతవభిక్షువేషుండవై రాత్రించరభవనంబులకుం జని యపుత్రవతులైన పిసితాశనవధూత్రితయంబు లొసంగు పూజలు గైకొని వారలకుఁ గొన్ని కపటమంత్రంబు లుపదేశించి యశ్వత్థాలింగనంబునఁ బుత్రులు గల్గెదరని యుపదేశించి గ్రక్కున నంతర్హితుండవై యొక్కయెడ నవకోమలపల్లవదీర్ఘశాఖాప్రవిస్తారంబై యొప్పు తిప్పల మహీరుహంబు తానయై యున్నంత; నానక్తంచరత్రితయం బుపవసించి మంగళాలంకృతలై యాయశ్వత్థాకారంబై యున్న బుద్ధసన్యాసిం గౌఁగిలింప నతండు వారలం బట్టి బింబాధరంబులు చుంబించుచు గాఢాలింగనం బొనర్చి విడువ, నయ్యువిదలు పాతివ్రత్యంబు దొలంగి ఱంకుటాండ్ర చందంబునం గొంకువడి యుండ, భండనంబునఁ దదీయజీవితేశ్వరుల కపజయంబు వొడమఁ దొడంగునని నీ వప్పుడు మేరుగిరిశరాసనంబునఁ గుంభీనసరాజును మౌర్విగాఁ గూర్చి , ధనుర్ధరుండ వయి తారకాపథకవచంబు దొడిగి, యుదధినిషంగంబు దరియించి, నారాయణచండప్రచండ కనత్కాండముఖంబున జాతవేదుం బదిలపఱచి, తద్బాణమూలంబున వైనతేయుం గూర్చి, మహీచక్రనిర్వక్రస్యందనంబున రవిశశిచక్రంబుల నమర్చి, విరించిప్రసాదిత కశాదండంబు కేల ధరియించి, నిగమహయంబులఁ బూన్చి పురంబుల కభిముఖుండవై ప్రళయపటహంబు వాయింపుచు నుబ్బి బొబ్బలిడుచు వేలుపుమూఁకలు వెంటనంటి నడువ మహాఘోరయుద్ధంబు సేయ రాక్షసపట్టణంబులు సమంబులు గాక విషమంబై దృశ్యాదృశ్యంబు లగుచు నలక్ష్యంబై యుండ సంవర్తసమయ సమవర్తిసమరోషంబున నీవు సమంత్రకంబుగాఁ బరమవైష్ణవబాణంబు వింట సంధించి నారి నాకర్ణాంతాకర్షణం బొనర్ప మహోగ్రజ్వలనజ్వాలాభీలధూపంబు లుప్పతిల్ల ఛటఛటాస్ఫుట ధగద్ధగాయమానంబులై విస్ఫులింగంబు లెగసి భగ్గుభగ్గున మంటలు మింటం బర్వం బురందరాది బృందారకులు జయజయధ్వానంబు లులియం బ్రయోగించి పట్టణంబుల నిట్టట్టు చననియ్యక నొక్కపెట్టున సర్వశర్వరీచరసహితంబుగా నేలం గూలునట్లుగాఁ జేసి భువనంబులం గాచిన మహానుభావునకుఁ నన్నుం గాచు టరుదే? మిమ్ముల నుతియించి వాక్పరిశ్రాంతి బొందకుండ నఖిలదుష్కృతవిముక్తుంగాఁ జేసి నన్నుం గటాక్షించి సుగతి యొసంగి రక్షింపవే! భవానీమనోహరా!