| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
12
ఖట్వాంగధరా! తొల్లింటిజన్మంబున నిన్నుం బూజింపని దోషంబున నీజన్మంబున నిరర్థకంబైన యభాజనుండనైతి. ఇప్పు డీషణత్రితయపదార్థంబు విసర్జించి మనస్సచివహితోపదేశంబునఁ బ్రవర్తింపుచున్న నన్ను దురహంకారప్రత్యర్థి తరుమం జొచ్చిన నరిషడ్వర్గవ్యాఘ్రంబులకు చిక్కక సప్తవ్యసనమహోరగంబులకు గొంకక తాపత్రయవృశ్చికంబులకుం బారక సంసారారణ్యమధ్యంబున నిరాటంకంబుగ విహరింప క్షుత్పిపాస లను దొంగలు నా వెంటఁబడి తరిమిపట్టి యాశాపాశంబులఁ గట్టి బహువిధరుజానీకంబు లను పిపీలికాచ్ఛన్న దుఃఖవృక్షంబున నంటంగట్టి చేరువ నొక్కచందనకాంతారవిహరణం బను సుఖమహీరుహంబున నడ్డంగొను బుద్ధినెచ్చెలి యను మనంబున నా మొఱ్ఱ మొఱ్ఱో ‘నమః శివాయ యన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ యనుచు గూఁతలు వెట్ట భయభ్రాంతులై పరిపంథికిరాతులు నన్ను విడిచి పలాయనులై చన నప్పుడు సుజ్ఞానుండును సన్నిహితుండునునైన దివ్యపురుషుం ‘డోడ కోడకు’ మని శైవాచారపట్నంబునకుం ద్రోవ చూప ని న్నాశ్రయించి భవన్నామసుధారసప్రవాహంబునం దనివారం గ్రీడింపఁ దలంచి నాలో నున్న దుష్కర్మంబులం బారఁద్రోలి విభూతిరుద్రాక్షాద్యలంకార శరీరభవనంబు ప్రవేశించితి. నా కిహపరసుఖం బాపాదించి మదీయహృదయసదనంబునఁ బ్రవేశించి యున్న నీయిల్లు చల్లనై వర్ధిల్లం గోరి యుండెద. నన్నుం గటాక్షించి యిహపరసుఖంబుల నొసంగి రక్షింపవే! భవానీమనోహరా!